వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు
ఒక్కో ఆలయానికి 5 మంది సభ్యులతో పాలకమండలి
మహిళకు తప్పనిసరి చోటు.. 20 రోజుల్లో దరఖాస్తుల ఆహ్వానం
దేవాదాయ శాఖ నోటీసులు జారీ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వర్ధన్నపేట పట్టణంలోని 3 ప్రధాన ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలకు పాలకమండళ్లను నియమించేందుకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 15(2), సవరణ చట్టం 33/2007లోని నిబంధనల ప్రకారం ఒక్కో ఆలయానికి 5 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కమిటీలో ఒక మహిళా సభ్యురాలికి తప్పనిసరిగా అవకాశం కల్పించనున్నారు. శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వరంగల్ కార్యాలయం నుంచి నోటీసు నంబర్ ఏ3/1977/2026, తేదీ 19-09-2026న జారీ అయింది. నోటీసులను ఆలయాలతోపాటు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. ట్రస్టీ పదవికి ఆసక్తి ఉన్నవారు నోటీసు ప్రదర్శించిన తేదీ నుంచి 20 రోజుల్లో ఫారం–2లో దరఖాస్తులను డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ, వరంగల్ కార్యాలయాలకు పంపాలని సూచించారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, పోలీసు వెరిఫికేషన్ అనంతరం అర్హులను ఎంపిక చేసి ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

