ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి
పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయండి : మంత్రి సీతక్క
కాకతీయ,ఏటూరునాగారం రూరల్ : యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవనం, వైటీసీ, పోలీస్ శిక్షణ కేంద్రాలను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి మాట్లాడారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

