ఉద్యమకారుల సంక్షేమానికి ఐక్య పోరు!
13, 14, 15 తేదీల్లో హనుమకొండలో ఓదార్పు యాత్ర
ఉద్యమంలో నష్టపోయిన ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి పరామర్శ
కుటుంబాల ఆర్థిక, జీవన స్థితిగతుల నమోదు
250 గజాల స్థలం, రూ.25 వేల పింఛను ఇవ్వాలి
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని, స్వరాష్ట్రంలోనూ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న ఉద్యమకారులకు అండగా నిలిచేందుకు ఈ నెల 13, 14, 15 తేదీల్లో హనుమకొండ కేంద్రంగా రెండో దశ తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా హక్కుల సాధన కోసం ఉద్యమకారులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కాకతీయ కాలనీలోని ఐక్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన యాత్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ములుగు రోడ్ జంక్షన్ నుంచి యాత్ర ప్రారంభమై హనుమకొండ చౌరస్తా, అంబేద్కర్ సెంటర్, అమరవీరుల స్తూపం, ఫాతిమా నగర్, కాజీపేట మీదుగా మడికొండకు చేరుకుంటుంది. 14న హనుమకొండ పరిసర ప్రాంతాల్లో, 15న కాజీపేట ప్రాంతంలో యాత్ర కొనసాగుతుంది. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని, గాయపడి, జైళ్లకు వెళ్లి, ఆర్థికంగా నష్టపోయి, అనారోగ్యానికి గురైన ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తామని, వారి కుటుంబాల ప్రస్తుత ఆర్థిక, జీవన స్థితిగతులను నమోదు చేస్తామని రవికుమార్ చెప్పారు. వరంగల్ కేంద్రంగా సాగిన తెలంగాణ ఉద్యమం రాష్ట్రవ్యాప్త పోరాటానికి దిశానిర్దేశం చేసిందని ఆయన పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు, ఆచార్య జయశంకర్, ఆచార్య జనార్దన్‌రావు స్ఫూర్తితో పాటు కాకతీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ, తుమ్మల పాపిరెడ్డి మార్గదర్శకత్వంలో ఉద్యమం ఐదు దశాబ్దాల పాటు కొనసాగిందన్నారు. న్యాయవాదులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు, ప్రజాసంఘాల పాత్ర చారిత్రాత్మకమని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలోనూ ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడటం పాలకుల వైఫల్యమని విమర్శించారు. లక్ష్మణ్ గౌడ్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు.
ప్రభుత్వం ముందు ఆరు ప్రధాన డిమాండ్లు
ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల గౌరవ పింఛను, రూ.10 లక్షల ఆర్థిక ఉద్దీపన పథకం అమలు చేయాలని ఐక్య వేదిక డిమాండ్ చేసింది. రూ.10 వేల కోట్ల బడ్జెట్‌తో ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల భవనాలు నిర్మించి ప్రముఖ ఉద్యమకారుల పేర్లు పెట్టాలని కోరింది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యాత్రలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులంతా పాల్గొని విజయవంతం చేయాలని రవికుమార్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ వొడపల్లి శ్యామ్‌కృష్ణ, జిల్లా అధ్యక్షులు షేక్ ఉస్మాన్ అలీ, బొలిశెట్టి అశోక్, రాష్ట్ర కమిటీ నేతలు జినుకుల లక్ష్మణ్‌రావు, రామబ్రహ్మచారి, దాసరి జనార్దన్, 1969 రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎన్.స్వామి, బాస్కె దశరడం, మొగుసాల దేవేందర్‌రెడ్డి, అనుముల రమేష్, మాలతీ, సౌరం స్వర్ణ, గుంతటి పద్మ, లక్ష్మి, సిరుమళ్ళ సావిత్రి, వై.మనోహర్, ధారా సూరి, స్వామి యాదవ్, రాజు ఇమ్మడి శెట్టి, మేకల రవి, అరికే రాంకుమార్, జమ్మల నాగరాజు, ఆర్.గంగాధర్, బి.సాగర్, కందగట్ల రమాదేవి, సిరిమల్ల గాయత్రి, పోగుల కిరణ్, చెంచు వెంకన్న, జలగం వెంకటయ్య, కేడల ప్రసాద్, పొలంపల్లి మల్లేశం, కొండేటి నారాయణరెడ్డి, ఎదునూరి రాజమౌళి, శ్రీనివాస్ చారి, రాంచందర్‌రావు, బంక కుమారస్వామి, బొచ్చు కుమార్, చంద్రయ్య, రాయపూరి చంద్రయ్య, పోగుల సుమలత, భైర్య రమేష్, బరిగేలా కృష్ణమూర్తి, రాంపల్లి శ్రీనివాస్, నల్ల కుమార్, మార్కండేయ, బోయిన విజయకుమార్, వైనాల మహేందర్, దామెర సాగర్, జక్కుల స్వామి యాదవ్, షేక్ దస్తగిరి, వంగపండ్ల రవి యాదవ్, సరేబోయిన ఉమ, చింత అశోక్, శోభనబోయిన సతీష్, మొలంగూరి నెల్సన్ తదితరులు పాల్గొన్నారు.

