రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో సత్తా చాటాలి
వరంగల్ జట్టుకు సీపీ ఎన్. శ్వేత శుభాకాంక్షలు
జట్టు కెప్టెన్‌గా ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్రస్థాయి పోలీస్ క్రికెట్ పోటీల్లో వరంగల్ పోలీస్ జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆకాంక్షించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఐదో రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో పాల్గొనేందుకు వరంగల్ కమిషనరేట్ తరఫున క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను సీపీ అభినందించారు. క్రీడాస్ఫూర్తితో ఆడి విజయాలు సాధించాలని, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

