తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి..
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన..
కాకతీయ, వరంగల్ బ్యూరో :తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కోటి సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామని, ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో కలిసి చదువుకునేలా 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్య అందించనున్నట్లు వివరించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, పుస్తకాలు, బ్యాగులతో పాటు రవాణా సదుపాయం కల్పిస్తామని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. కుటుంబ అనుబంధాలకు ఆటంకం కలగకుండా సెమీ రెసిడెన్షియల్ విధానంలో పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొన్నారు.

27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం..
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసిన పోషకాహారాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఒక గంట వ్యవధిలో ఇంతమంది విద్యార్థులకు అల్పాహారం అందించడం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ ప్రత్యేకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విద్యావ్యవస్థను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ నగరంతో పాటు కాజీపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ రాజు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

