చేయూత పెన్షన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు!
18న మంత్రి సీతక్క చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు
సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ సత్యశారద
కాకతీయ, వరంగల్ : నూతన చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం స్టేషన్ చింతలపల్లి వద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పైలాన్ ప్రాంతంలోని సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదిక, తాగునీరు, లబ్ధిదారులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో జడ్పీ సీఈఓ వసంత, గీసుగొండ తహసీల్దార్ రియాజుద్దీన్, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్, గీసుగొండ ఎంపీడీఓ శ్రీధర్, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.\

