జిల్లా ఆస్పత్రిలో 20 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పనులకు శ్రీకారం
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
కాకతీయ, నర్సంపేట టౌన్:-నర్సంపేట జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం మరో కీలక అభివృద్ధి పనికి మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. ఆస్పత్రి ఆవరణలో 20 లక్షల వ్యయంతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ వెల్లడించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మున్సిపాలిటీ ముందుకు సాగుతోందన్నారు.ముఖ్యంగా జిల్లా ఆస్పత్రికి నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు, వారి సహాయకులు వస్తుంటారని, వారికి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టాయిలెట్ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు సూచించనున్నట్లు తెలిపారు. ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి, కౌన్సిలర్లు పున్నం నరసింహారెడ్డి, పొన్నాల మనిషా ప్రకాష్, మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ములుకల మనీష్ తదితరులు పాల్గొన్నారు.

