వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్!
ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్ట్..
నలుగురు బాలుర అదుపులోకి
రూ.18.44 లక్షల విలువైన 84 మోటార్లు, నాలుగు వాహనాలు స్వాధీనం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,44,800 విలువైన 84 మోటార్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గురువారం ఉదయం రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ రాజన్‌బాబు సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సీసీఎస్ సిబ్బంది సహకారంతో విచారించారు. డీజే ఆపరేటర్లు, స్టేజ్ డెకరేషన్ పనులు చేసే నిందితులు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు రాత్రివేళల్లో నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ, ములుగు మండలాల శివారు గ్రామాల్లో మోటార్లు దొంగిలించినట్లు అంగీకరించారు. రాజుపేట శివారులోని చెట్ల పొదల్లో దాచిన 84 మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు హంస ప్రశాంత్, అన్న శివప్రసాద్, ఎస్.కె. దస్తగిరి అలియాస్ షైర్గా గుర్తించారు. ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, పల్సర్, షైన్ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ మోటార్ల భద్రతపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, ఎస్ఐ రాజన్‌బాబు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు హరికృష్ణ, రాఘవేందర్రావు పాల్గొన్నారు.

