‘ఆరోగ్యదర్శిని’ ప్రచురణ అభినందనీయం
అడిషనల్ డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు
కాకతీయ, హన్మకొండ : ప్రజలకు హోమియో వైద్యంపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలనే ఆశయంతో 12 ఏళ్లుగా ‘ఆరోగ్యదర్శిని’ పక్షపత్రికను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని అడిషనల్ డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు, వేముల శ్రీనివాస్ అన్నారు. ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రిక 12వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, హోమియో వైద్యరంగ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం మంచి ప్రయత్నమని పేర్కొన్నారు. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజారోగ్యమే ధ్యేయంగా పక్షపత్రికను కొనసాగించడం స్ఫూర్తిదాయకమన్నారు. మరిన్ని సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పత్రిక ఎడిటర్ డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ హోమియో వైద్యంపై సరైన అవగాహన పెంపొందించడంతో పాటు, వైద్యానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయాలనే సంకల్పంతో పత్రికను ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ చంద్రశేఖర్, వరంగల్ ప్రెస్‌క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

