రైతు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు పిలుపు
మే 12–14 తేదీల్లో మహాసభలు
దేశవ్యాప్తంగా రైతు ప్రతినిధుల హాజరు
ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఉపాధి రంగం దెబ్బతింటోందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మే 12, 13, 14 తేదీల్లో వరంగల్ నగరంలో నిర్వహించనున్న రైతు జాతీయ మహాసభల సన్నాహక సమావేశం ఆదివారం రంగసాయిపేటలోని వందన కన్వెన్షన్ హాల్లో జరిగింది. అఖిలభారత రైతు సమాఖ్య, జమ్మూరి కిసాన్ సభల విలీన ఐక్యత మహాసభల ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షత వహించారు.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు
ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. భారీ బడ్జెట్లు ప్రవేశపెట్టినా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం లేకపోయిందన్నారు. ఉపాధి హామీ పథకం బలహీనపడిందని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని విమర్శించారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి రైతు ఉద్యమ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. భవిష్యత్తు రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం నాయకులు కుసుంబా బాబురావు, గోనె కుమారస్వామి, ముక్కెర రామస్వామి, మంద రవి, నర్ర ప్రతాప్, సుంచు జగదీశ్వర్, గాజుల వెంకటయ్య, దామ సాంబయ్య, గణిపాక ఓదెలు, పరిమళ గోవర్ధన్ రాజు, ఐతమ్ నాగేష్, చుక్క ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

