మోదీ క్షమాపణ చెప్పాలి
మహిళల గురించి బీజేపీ మాట్లాడడం సిగ్గుచేటు
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
పద్దతి ప్రకారం బిల్లు పెట్టుమంటున్నాం
ఎన్నికలు ఉండగా ఎందుకు ఇంత హడావిడి?
మహిళా బిల్లు అవశ్యకతను మొదట గుర్తించిందే కాంగ్రెస్
క్రెడిట్ కోసమే బీజేపీ నేతల డ్రామాలు
అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే బిల్లు పెట్టాలి
మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి మహిళలను మోసం చేస్తూ కపట ప్రేమ చూపిస్తోందని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, త్వరలో జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపొందడం కోసం బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత ముప్పు ఉందని గ్రహించి, దాన్నుంచి బయటపడాలనే ఏకైక లక్ష్యంతో మహిళా బిల్లును 16వ తేదీన తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు సోమవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడారు. ప్రధాని మోదీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
40 సంవత్సరాల క్రితమే ..
40 సంవత్సరాల క్రితమే దివంగత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మహిళా రిజర్వేషన్‌ను లోక్‌సభ, రాజ్యసభలో అమలు చేయాలని చర్చ ప్రారంభమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా నాయకత్వంలో ఒక పార్లమెంట్ కమిటీ వేశారని.. కొంతమంది దీనిని వ్యతిరేకించారని అన్నారు. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. అలాగే 2013లో సోనియా గాంధీ సూచన మేరకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం పొందలేదని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ చట్టం ప్రకారం… జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ అమలు 2034 తర్వాత జరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును 10 సంవత్సరాల క్రితమే అమలు చేయాల్సి ఉండేదని,, ఎందుకు చేయలేదని స్వర్ణ ప్రశ్నించారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడానికే..
కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పుడు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చిందన్నారు స్వర్ణ. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ అమలు కోసం 40 సంవత్సరాల క్రితం నుంచే చిత్తశుద్ధితో ఉందన్నారు. అదే చిత్తశుద్ధి, అదే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ 73వ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి (1992) దేశంలోని మహిళలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని ద్వారా దేశంలోని సుమారు 15 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరింది. ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీలకు కూడా ఈ రిజర్వేషన్‌లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది. బీజేపీ ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ హైడ్రామా ఇదంతా . మరోవైపు డిలిమిటేషన్ ప్రక్రియ కూడా గందరగోళంగా ఉంది. సగటుగా 50శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని స్వర్ణ అన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

