భూ వివాదం ముదురుతోంది
పట్టా మార్పుపై అనుమానాలు
గైర్హాజరీని ఆసరాగా చేసుకున్నారంటూ ఆరోపణలు
న్యాయం చేయకపోతే తీవ్ర నిర్ణయం హెచ్చరిక
కాకతీయ, కారేపల్లి : మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీలో భూమి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. గ్రామానికి చెందిన కుర్స మల్లయ్య, ఆయన కుమారుడు కుర్స రాములు తమకు చెందిన భూమిపై హక్కులు కోల్పోయామని ఆరోపిస్తూ న్యాయం కోసం అధికారులను ఆశ్రయిస్తున్నారు. వివరాల ప్రకారం సర్వే నంబర్ 548/98/2లో ఉన్న గంగాల భూమి తమదేనని వారు పేర్కొంటున్నారు. జీవనోపాధి కోసం కొంతకాలం గ్రామాన్ని విడిచి వెళ్లి తిరిగి వచ్చేసరికి తమ భూమి పట్టా ఇతరుల పేర్లపై నమోదైందని తెలిసి షాక్‌కు గురయ్యామని బాధితులు తెలిపారు. ఇల్లు కాలిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చిందని, ఆ విషయం గ్రామస్థులకు కూడా తెలిసినదేనని చెప్పారు. తమ గైర్హాజరీని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు అక్రమంగా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ వద్ద ఉన్న పత్రాలు భూమి తమదేనని నిరూపిస్తాయని పేర్కొంటూ, అధికారులు సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే కుటుంబంతో కలిసి తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరించడం గమనార్హం. ఈ భూమి వివాదంపై రెవెన్యూ, పోలీస్ శాఖలు తక్షణమే స్పందించి నిజానిజాలు వెలికితీసి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. “భూమి కోల్పోతే జీవితం కోల్పోయినట్టే” అంటూ బాధితులు వ్యక్తం చేస్తున్న ఆవేదనకు అధికారులు స్పందిస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

