కూసుమంచి యువకుడికి అంతర్జాతీయ గౌరవం
ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్
మానవ హక్కుల పరిరక్షణలో విశిష్ట సేవలకు గుర్తింపు
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం గోరిలాపాడు తండాకు చెందిన డా. పీటర్ నాయక్ లకావత్ ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ సంస్థ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ అధినేత డా. సి. హెచ్. విజయ్ మోహన్ రావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ… డా. పీటర్ నాయక్ లకావత్ సామాజిక బాధ్యతతో, మానవ హక్కుల పరిరక్షణలో చూపుతున్న చురుకైన పాత్రను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఎల్లప్పుడూ వారి పక్షాన నిలబడే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉందన్నారు. డా. పీటర్ నాయక్ లకావత్ పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తూ దేశీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు లభించిన ఈ పదవి సేవా నిబద్ధతకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు.
పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, ఆర్థిక సహాయం, అత్యవసర సేవలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.
సమాజానికి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం
చిన్ననాటి కష్టాలను అధిగమించి సమాజ సేవే లక్ష్యంగా ఎదిగిన డా. పీటర్ నాయక్ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా డా. పీటర్ నాయక్ మాట్లాడుతూ… ఈ అవకాశాన్ని కల్పించిన సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మానవ హక్కుల పరిరక్షణలో మరింత కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు, ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

