ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పీఎం కిసాన్ సహా అన్ని పథకాల లబ్ధికి అనుసంధానం
డిజిటల్ వ్యవసాయానికి ఫార్మర్ ఐడి కీలకం
వర్షాకాలం నుంచి పథకాల అమలుకు నమోదు తప్పనిసరి
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్
కాకతీయ, కొత్తగూడెం : ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో తప్పనిసరిగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, మీ సేవ కేంద్రాల మేనేజర్లతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధార్ మాదిరిగానే ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపుగా 14 అంకెల ఫార్మర్ ఐడి కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు చెప్పారు. భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందిస్తారని, రెవెన్యూ శాఖ భూ రికార్డులను రైతుల ఆధార్‌తో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడి జారీ చేస్తారని వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా కొత్త చట్టబద్ధ హక్కులు కల్పించబడవని, ఇది కేవలం ప్రభుత్వ రికార్డుల ఆధారంగా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వడానికే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తున్నారని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడతల లబ్ధి పొందాలంటే నమోదు అవసరమని తెలిపారు. రాబోయే వర్షాకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ, పంటల కొనుగోలు, ఎరువుల పంపిణీ వంటి సేవలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా మారుతుందని పేర్కొన్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, భూ పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీప వ్యవసాయ అధికారులను లేదా మీ సేవ కేంద్రాలను సంప్రదించి వెంటనే నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి రైతుకు అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు, మీ సేవ కేంద్రాల సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు.

