కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా దాడి శివ?
నేడు లేదా రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
యువ నాయకత్వానికి పెద్దపీట వేసిన పార్టీ అధిష్ఠానం
శాయంపేట హవేలీ నుంచి మండల స్థాయికి ఎదిగిన శివ
గతంలో పీఏసీఎస్ డైరెక్టర్‌గా సేవలందించిన అనుభవం
కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి యువ నాయకుడు దాడి శివ పేరు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు లేదా రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య వర్గాలు వెల్లడించాయి. మండలంలోని శాయంపేట హవేలీ గ్రామానికి చెందిన దాడి శివ, క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో వంచనగిరి పీఏసీఎస్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, తనదైన శైలిలో నాయకత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తన గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు ఆరుగురు వార్డు సభ్యులను గెలిపించుకోవడంలో శివ కీలక పాత్ర పోషించి, తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. దాడి శివ కుటుంబానికి శాయంపేట హవేలీ గ్రామ రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర ఉంది. ఆయన తండ్రి దాడి వెంకటయ్య 1981 నుంచి 1990 వరకు సర్పంచ్‌గా పనిచేసి గ్రామంలో పంచాయతీ భవనం, బస్టాండ్ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించి జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర ఆయనకుంది. అలాగే శివ తల్లి దాడి సత్యవతి కూడా 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా కొనసాగి సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్, పాఠశాల గదుల నిర్మాణం వంటి పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. తల్లిదండ్రుల నుంచి అబ్బిన ఈ సేవా దృక్పథమే శివను మండల స్థాయి పదవికి ఎంపిక చేసేలా చేసిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
గీసుగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే క్రమంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన అధిష్ఠానం, దాడి శివ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి నిబద్ధతతో పనిచేసిన శివకు ఈ పదవి దక్కడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం, ఆయన బాధ్యతలు స్వీకరించి మండలంలో పార్టీని నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నియామకం మండల రాజకీయాల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

