ఆత్మీయ భరోసా అమలు చేయాల్సిందే
ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
వ్యకాస నేత నాగేశ్వరరావు
కాకతీయ, కారేపల్లి: భూమిలేని పేదలకు ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని వివిధ ఉపాధి హామీ పని ప్రదేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు పేదలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో సక్రమంగా వ్యవహరించడం లేదని నాగేశ్వరరావు విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల వల్ల పేదలు ఉపాధి పనులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు సంబంధించి నెలల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యకాస నాయకులు యనమనగండ్ల రవి, కేసగాని ఉపేందర్, పాసిని నాగేశ్వరరావు, చల్లా మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

