పొద్దున కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో రేవంత్‌రెడ్డి
కేసీఆర్ స్థాయి ఏంటో, రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసు
నేను ఢిల్లీ వెళ్తే సీఎంవో నుంచి లీకులు
మా నాయకుడి ఆదేశం మేరకే రాజధానికి..
విషయం లేకనే ఇలాంటి చిల్లర పనులు
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఈ రెండేళ్లైనా మంచి పనులు చేస్తేనే కాంగ్రెస్‌కు డిపాజిట్లు..
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ సభ టైమ్‌లో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్‌పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. నేను ఢిల్లీ వెళ్తే సీఎంవో నుంచి లీకులు ఇప్పించాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులకు దిగుతారని విమర్శించారు. నేను, వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర కలిసి ఢిల్లీకి వెళ్లామని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ఇవ్వబోతున్న నేపథ్యంలో హైకోర్టులో న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం ఉందని తెలిపారు. ఒకవేళ హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేయడానికి సీనియర్ న్యాయవాదులను కలిశామని వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై కూడా చర్చించామని హరీశ్‌రావు తెలిపారు. నేడు మధ్యాహ్నం మూడున్నర గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ కూడా ఉందని తెలిపారు.
పట్టపగలు దొరికిన దొంగ
ఓటుకు నోటు కేసులో పట్టపగలు రూ.50 లక్షల బ్యాగ్‌తో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు విమర్శించారు. హోంమంత్రివి నువ్వే.. ముఖ్యమంత్రివి నువ్వే.. ముద్దాయివి నువ్వే అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాను న్యాయవాదులుగా పెట్టుకున్నాడని తెలిపారు. ప్రభుత్వం తరఫున గౌరవ్ అగర్వాల్‌ను పెట్టుకున్నారని పేర్కొన్నారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని పన్నాగం కట్టినవ్ కదా.. బీఆర్ఎస్ తరఫున మంచి న్యాయవాదులను పెట్టేందుకు ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు. మా నాయకుడి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. నీలాంటి దొంగలకు శిక్ష పడాలనేది మా ప్రయత్నం అని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా నువ్వు స్టే మీద బతుకుతున్నావని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స్టే వెకేట్ అయితే జైలుకు వెళ్తావని హెచ్చరించారు. పొద్దుగాళ్ల కాంగ్రెస్, రాత్రిపూట బీజేపీతో తిరుగుడు రేవంత్ రెడ్డికి అలవాటు అని విమర్శించారు.
పులిని చూసి నక్క వాతలు
బీఆర్‌ఎస్ సభ సమయానికే కాంగ్రెస్ సభ పెట్టడంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందని సెటైర్లు వేశారు. కేసీఆర్ స్థాయి ఏంటో, రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడారని తెలిపారు. నిన్నటి సభలో రేవంత్ పేరును కేసీఆర్ లేవనెత్తారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ ఇప్పటికైనా హుందాగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లయినా దక్కుతాయని మాజీ మంత్రి హితవుపలికారు. మిగిలిన రెండున్నరేళ్లయినా మంచి పాలన అందించాలని సూచించారు. ‘నేను ఢిల్లీ వెళ్తే సీఎంవో నుంచి లీకులు ఇచ్చారు. విషయం లేనివారే ఇలాంటి ప్రచారాలు చేస్తారు. నా ఢిల్లీ పర్యటనలో ఎలాంటి దాపరికంలేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచే ఢిల్లీకి వెళ్లా. ఫిరాయింపుల కేసుపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్లాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

