కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్
భూ రికార్డుల నమోదులో కొత్త అధ్యాయం ఆరంభం
సర్వే మ్యాప్, భూధార్ నెంబర్ల కేటాయింపు షురూ
గట్టుసింగారం భూమికి విజయవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
భూ వ్యవహారాల్లో పారదర్శకతకు ‘భూభారతి’ పోర్టల్ : తహసీల్దార్ సైదులు
కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండల రెవెన్యూ చరిత్రలో సరికొత్త మార్పు మొదలైంది. సర్వే మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మండలంలోని గట్టుసింగారం రెవెన్యూ గ్రామానికి చెందిన భూమికి హద్దులతో కూడిన మ్యాప్‌ను జత చేసి, ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. గట్టుసింగారం గ్రామ సర్వే నెంబర్ 156/ఇ/1 లో ఉన్న ఎకరం నాలుగు కుంటల భూమిని, ముఠాపురం గ్రామానికి చెందిన రైతు భాగం కిషన్ రావు.. కట్టా వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి విక్రయించారు. ఈ క్రమంలో భూమి హద్దులను స్పష్టంగా చూపే మ్యాప్‌ను రిజిస్ట్రేషన్ పత్రాలకు జత చేసి, కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో ప్రక్రియను పూర్తి చేశారు. ఈ భూమికి సంబంధించి భూకమతం పటం మరియు ప్రత్యేక భూధార్ నెంబర్ ను తహసీల్దార్ కేటాయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం..
ఈ సందర్భంగా తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా భూ వ్యవహారాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చిందని తెలిపారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, అత్యాధునిక రోవర్ల సాయంతో అత్యంత కచ్చితత్వంతో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక గుర్తింపు: ప్రతి భూమికి ఒక ప్రత్యేక సర్వే మ్యాప్ మరియు భూధార్ నెంబర్ కేటాయించడం వల్ల యాజమాన్యంపై ఎలాంటి వివాదాలకు తావుండదని పేర్కొన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఈ సేవలన్నీ ప్రజలకు సులభంగా మరియు వేగంగా అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. ఈ నూతన విధానం వల్ల మండలంలోని భూములకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సరిహద్దు తగాదాలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

