నాదండ్ల భాస్కర్‌రావు కన్నుమూత
అనారోగ్యంతో తుది శ్వాస
20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స
ఎమ్మెల్యే, ఎంపీగా కీలక బాధ్యతలు
ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా రికార్డు
కేవలం 31 రోజులపాటు పదవిలో..
రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం పదవిలో ఉన్న సీఎం..
నేడు పంజాగుట్టలో అంత్యక్రియలు
నాదెండ్ల మృతిపట్ల పలువురు నేతల దిగ్భ్రాంతి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కరరావు వృద్దాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్‌రావు 1935 జూన్ 23లో గుంటూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు పనిచేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు 31 రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 31 రోజుల పాటు సీఎం పీఠంపై కూర్చున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే ‘ఆగస్టు సంక్షోభం’లో అతను కీలక పాత్రధారి. అప్పట్లో ఎన్టీఆర్ వెన్నంటే ఉండి, ఆపై ఆయనకే సవాల్ విసిరిన వైనం నేటికీ చర్చనీయాంశమే.
రాజకీయాల్లో కీలక పాత్ర
1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాల్లో కీలక శాఖలను నిర్వహించారు. 1982లో నందమూరి తారక రామారావు ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించినప్పుడు భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. 1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించాక, ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ మద్దతుతో సీఎం..
ఎన్టీఆర్ టెక్సాస్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వచ్చిన వేళ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. కాంగ్రెస్ మద్దతుతో 1984 ఆగస్టు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా నెల రోజులకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1998లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. 2019లో ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా నాదెండ్ల మనోహర్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా, ఆయన పార్థివ దేహాన్ని జూబిలీహిల్స్ లోని వారి స్వగృహం వద్ద ఉంచనున్నారు. గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

