పర్యావరణాన్ని పరిరక్షించాలి
ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలి
అదే లీడ్ ఇండియా ఫౌండేషన్ లక్ష్యం
సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సుదర్శన్ ఆచార్య
రాజధానిలో ఘనంగా దాత్రి దినోత్సవం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని కాసుల బ్రహ్మనందరెడ్డి నేషనల్ పార్క్లో భూమి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. “లీడ్ ఇండియా ఫౌండేషన్” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తు చేసింది. ఈసందర్భంగా “లీడ్ ఇండియా “ వ్యవస్థాపకులు డాక్టర్ బి. ఎన్. సుదర్శన్ ఆచార్య ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “భూమి మనకు ఇచ్చిన వరాలు అమూల్యమైనవి. వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు భవిష్యత్ తరాలకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని అన్నారు. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చిన్న మార్పులు తీసుకువస్తే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పర్యావరణ ప్రతిజ్ఞ
లీడ్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ విస్తరాకు వేణు మాట్లాడుతూ… ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణమే లీడ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం. ప్లాస్టిక్ వినియోగం వల్ల నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అనుసరించాలి” అని పిలుపునిచ్చారు. సమాజంలో సుస్థిరమైన మార్పు కోసం యువత ముందుకు రావాలని ఆయన సూచించారు. నిర్వాహకురాలు డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. “ప్రత్యామ్నాయ భూగోళాన్ని మనం సృష్టించలేము. అందుకే ఈ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రకృతిని కాపాడితేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వందల సంఖ్యలో లీడ్ ఇండియా కార్యకర్తలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పాల్గొన్న వారు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం, చెట్ల నరికివేత, నీటి వృథా వంటి అంశాలను నిరోధించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.

