డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాగిజావ పంపిణీ
కాకతీయ, ఖమ్మం టౌన్ : వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున న్యాయవాదులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం జిల్లా జడ్జి జీ. రాజగోపాల్ సూచించారు. బుధవారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలు ముందు ఈసీ మెంబర్ తవనం శేఖర్ రెడ్డి నేతృత్వంలో డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రాగిజావ పంపిణీ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. న్యాయవాదులందరికీ ఉచితంగా రాగిజావను వేసవి కాలం మొత్తం పంపిణీ చేస్తామని నిర్వాహకుడు, డీడీఎల్ ట్రస్ట్ మెంబర్ తవనం శేఖర్ రెడ్డి వెల్లడించారు. న్యాయవాదుల సంక్షేమం కోసమే ఈ సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాదుల ఆరోగ్యాన్ని కాపాడేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి రమేష్, జనరల్ సెక్రటరీ కొప్పుల రవికుమార్, బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే ప్రస్తుత బార్ కౌన్సిల్ మెంబర్ మందడపు శ్రీనివాస్ రావు, నిరంజన్ రెడ్డి, స్వామి రమేష్, శరత్ కుమార్ రెడ్డి, సత్య ప్రసాద్, మలీదు నాగేశ్వరరావు, కోన వెంకట గుప్తా, విజయశాంత, డీ కళ్యాణి మరియు ఇతర సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని న్యాయవాదులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

