ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ‘గులాబీ’ మద్దతు
ఖమ్మం డిపో ఎదుట నిరసన చేపట్టిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
ఎమ్మెల్సీ తాతా మధు సంఘీభావం
డిమాండ్లు పరిష్కరించకపోతే ఊరుకోమంటూ హెచ్చరిక
కాకతీయ, మయూరి సెంటర్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికుల వద్దకు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న వేతన సవరణ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని హితవు పలికారు.
ప్రజల ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత..
సమ్మె కారణంగా సామాన్య ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, నాయకులు ఉప్పల వెంకటరమణ, ముత్యాల వెంకటప్పారావు, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు మహమ్మద్ రఫి, చామకూరి రాజు, లింగనబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

