రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు
రైతులకు బేడీలు వేసిన చరిత్ర వారిది
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు
కాకతీయ, కూసుమంచి: రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర కలిగిన బిఆర్ఎస్ నాయకులకు, రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు. రైతు పక్షపాతిగా ఆ పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న సానుభూతి ‘మొసలి కన్నీరు’ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరి, మొక్కజొన్న సాగు పెరగడం హర్షనీయమని, రైతులందరూ సంతోషంగా ఉన్నారని నాగరాజు పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఆదేశాల మేరకు కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.
రెండు లక్షల టన్నుల కొనుగోలుకు సిద్ధం..
జిల్లాలో ఇప్పటికే 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అవసరమైన చోట మరిన్ని కేంద్రాలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మరో రెండు లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వం ఎంత నష్టానికైనా సిద్ధపడి రైతులకు అండగా నిలుస్తుందని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరారు.

