నల్లబెల్లం నిల్వలపై ఎక్సైజ్ దాడులు
గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
నేలకొండపల్లి మండలంలో టాస్క్ఫోర్స్ తనిఖీలు
కాకతీయ, కూసుమంచి: నేలకొండపల్లి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లంపై ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని కోనాయగూడెం, శంకర్ గిరితండా గ్రామాల్లో నల్లబెల్లం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో ఖమ్మం జిల్లా టాస్క్ ఫోర్స్ (డిటిఎఫ్), నేలకొండపల్లి ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. కోనాయగూడెం గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి శ్రీనివాస్ తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లాన్ని అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తి నల్లబెల్లాన్ని గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, సుమారు 1.944 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఈఎస్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. చట్టవిరుద్ధంగా నల్లబెల్లం నిల్వ చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీకి సహకరించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఈ దాడుల్లో డిటిఎఫ్ సీఐ కరుణశ్రీ, ఎక్సైజ్ సీఐ రమేష్, ఎస్సై లత మరియు సిబ్బంది పాల్గొన్నారు.

