ఏటీఎంలో విషాదం… ఊపిరాడక వ్యక్తి మృతి!
లోపలికి వెళ్ళగానే లాక్ అయిన డోర్
కాకతీయ, హైదరాబాద్ : నగరం నడిబొడ్డున ఉన్న విజయనగర్ కాలనీలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లిన ఒక వ్యక్తి, అక్కడే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మల్లెపల్లి పరిధిలోని ఒక హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సదరు వ్యక్తి నగదు కోసం ఏటీఎం లోపలికి వెళ్లగానే డోర్ లాక్ అయిపోయింది. బయటకు వచ్చే మార్గం లేకపోవడం, ఏసీ పని చేయకపోవడంతో పాటు బయట నుంచి గాలి వచ్చే అవకాశం లేకపోవడంతో లోపల ఆక్సిజన్ తగ్గిపోయి ఊపిరాడక అతడు మృతి చెందాడు. ఏటీఎంలో వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే బ్యాంకు సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బ్యాంకు అధికారులు డోర్ తెరిచి చూడగా అప్పటికే ఆ వ్యక్తి మరణించి ఉన్నాడు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ప్రాథమికంగా ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మరణానికి కారణం కేవలం ఊపిరాడకపోవడమేనా లేక భయంతో గుండెపోటు వచ్చిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

