ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకం కలిగించాలి
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తానని ఆయన హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్ర ఆసుపత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఎక్కడా మందుల కొరత ఉండకూడదని స్పష్టం చేశారు. “పేద ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానాలకు వస్తారు. అందుబాటులో ఉన్న వనరులతోనే వారికి నాణ్యమైన చికిత్స అందించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అని సూచించారు. ఆసుపత్రుల్లో రోగులకు, వారి సహాయకులకు అవసరమైన మంచినీరు, పారిశుధ్యం వంటి కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి..
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో జవాబుదారీతనంతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో వైద్య ఖాళీలు, అవసరమైన కొత్త పరికరాలు, మందుల నిల్వలపై సమగ్ర నివేదికను వెంటనే తనకు అందజేయాలని అధికారులను కోరారు. ఈ నివేదిక ఆధారంగా పైస్థాయిలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

