స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలి
మొదటిసారి డిజిటల్ విధానంలో జన గణన
వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్: జనాభా గణన-2027లో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియను జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆమె స్వయంగా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి కేవలం ఐదు నిమిషాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఈ వెబ్‌సైట్ పూర్తి సురక్షితమైనదని, ప్రజలు ఇచ్చే సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు 34 ప్రశ్నలకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. స్వీయ గణన ద్వారా ఇచ్చే సమాచారం వల్ల ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆమె భరోసా ఇచ్చారు.
తెలంగాణ ఏర్పడ్డాక తొలి గణన..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జన గణన ఇదేనని, దీనిని పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,117 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించామని, గణన కోసం 1,025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్ ఓ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

