ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
నీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి
పనులను పరిశీలించిన డీఆర్‌డీఓ నాగ పద్మజ
కాకతీయ, గీసుగొండ: ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు పని ప్రదేశాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స సౌకర్యాలను తప్పనిసరిగా కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె. నాగ పద్మజ ఆదేశించారు. మంగళవారం మండలంలోని ఊకల్, నందనాయక్ తండా, కొమ్మాల, కొనాయిమాకుల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, నర్సరీలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 100 మంది వేతనదారులు ఉండేలా పనులు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్, మే నెలల్లో లేబర్ బడ్జెట్ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఈ వారంలోనే విడుదలవుతాయని, కూలీలు ఉదయం వేళల్లోనే పనులకు హాజరై కొలతల ప్రకారం పనిచేసి పూర్తి వేతనం (రూ. 307) పొందాలని సూచించారు.
నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ..
ప్రతి 40 మంది వేతనదారులకు ఒక వర్కింగ్ మేట్‌ను నియమించి హాజరు నమోదు, పనుల నిర్వహణను సులభతరం చేయాలన్నారు. ఎన్‌ఎంఎంఎస్ విధానంలో హాజరు తీసుకునేటప్పుడు రెండు ఫోటోలు తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. నర్సరీల్లో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచి రోడ్ల ఇరువైపులా నాటాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచులు సుభాష్, వీరేందర్, యమున, వజ్ర రాజు, ఏపీఓ చంద్రకాంత్, ఈసీ శ్రీలత, టీఏలు సత్యనారాయణ సింగ్, సుష్మ, సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

