అక్రమాలపై వార్త రాస్తే కేసులు
కాకతీయ రిపోర్టర్‌పై తప్పుడు కేసులు
బెదిరించి.. ఒత్తిళ్లకు గురి చేసి డాక్టర్ చేత ఫిర్యాదు
నాకేం తెల్వదు.. మీరెవరో కూడా తెలియదు..
పోలీసు అధికారులే మీ పేరు ఫిర్యాదులో చేర్చాలన్నారు
నాపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు..అందుకే అలా చేశాను
డాక్టర్ గూడూరు రవీందర్ ఆడియో, వీడియో సంభాషణాలు వెలుగులోకి
సాక్ష్యాధారాలతో సహా డీజీపీ శివధర్‌రెడ్డికి కాకతీయ ఫిర్యాదు
సీఐ శ్రీనివాస్, డీఎస్పీ నాగేంద్రచారి అసలు రూపం బహిర్గతం
సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జయంత్ కురచ బుద్ధి
ఖాకీల ప్రాపకం కోసం తోటి జర్నలిస్టులపైనే కుట్రలు
కేసులతో వేధిస్తే.. కలంతోనే సమాధానం చెబుతాం
తప్పుడు కేసులతో మా గొంతు నొక్కలేరు
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం!
అప్రతిహత పోరాటం సాధించేందుకు కాకతీయ సిద్ధం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసు యంత్రాంగం బరితెగింపు పరాకాష్టకు చేరింది. అక్రమాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ‘కాకతీయ’ విలేకరిపై అక్రమ కేసులు బనాయించి, గొంతు నొక్కేందుకు పక్కా స్కెచ్ వేశారు. అసలు సంబంధం లేని కేసులో కావాలనే పేరు చేర్పించి, జర్నలిస్టును నేరస్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు పోలీసు అధికారులేనని ఫిర్యాదు చేసిన డాక్టర్ గూడూరు రవీందర్ స్వయంగా ఆడియో, వీడియో సాక్ష్యాల్లో వెల్లడించడం గమనార్హం. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, డీఎస్పీ నాగేంద్రచారిల అసలు రూపం ఈ ఉదంతంతో బహిర్గతమైంది. “పోలీసు అధికారుల ఒత్తిడి మేరకే ఫిర్యాదులో మీ పేరు చేర్చాను.. నాకు మీరెవరో కూడా తెలియదు” అంటూ సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో డాక్టర్ రవీందర్ నిజం ఒప్పుకోవడంతో ఇద్దరు పోలీసు అధికారుల బుద్ధి బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియోలతో సహా డీజీపీ శివధర్‌రెడ్డికి అందజేస్తూ కాకతీయ ఫిర్యాదు చేసింది.

ఖైదీలకన్నా ఘోరంగా.. ఖాకీల ‘ఒత్తిడి’ రాజకీయం!
పోలీస్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై వార్తలు రాసినందుకు పగ పెంచుకున్న ఇద్దరు పోలీసు అధికారులు, తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జర్నలిస్టులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. డాక్టర్ గూడూరు రవీందర్‌ను పావుగా వాడుకుని తన హాస్పిటల్‌కు వచ్చి కొంతమంది జర్నలిస్టులు బెదిరింపులకు గురి చేసినట్లుగా ఓ తప్పుడు ఫిర్యాదు చేయించారు. ఈనెల 3న బెదిరించినట్లుగా ఈనెల 18న డాక్టర్ చేత ఫిర్యాదు చేయించారు. వాస్తవానికి కాకతీయ రిపోర్టర్ తనతల్లి మోకాలికి శస్త్ర చికిత్స కోసం గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఈనెల 3 బెదిరిస్తే.. 18న ఫిర్యాదు చేయించడం.. ఆతర్వాత కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే..ఎలాంటి సాక్ష్యాలు కూడా చూపకుండానే ఎఫ్ ఐఆర్ నమోదు చేసి.. నాటకానికి సీఐ శ్రీనివాస్, డీఎస్పీ నాగేంద్రచారి తెరలేపారు. ‘కాకతీయ’ రిపోర్టర్‌పై తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించారు. నిజాన్ని నిర్భయంగా రాస్తున్నందుకు ఇలాంటి వేధింపులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ఈ అక్రమ కేసుపై ‘కాకతీయ’ యాజమాన్యం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పక్కా సాక్ష్యాధారాలతో సహా డీజీపీ శివధర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. డాక్టర్ రవీందర్ ఆడియో, వీడియో సంభాషణలను కూడా ఇందుకు సాక్ష్యంగా చూపింది.

జయంత్ ‘కురచ’ బుద్ధి.. ప్రెస్‌క్లబ్ ప్రతిష్ట గంగపాలు!
ఈ మొత్తం కుట్ర కేసులో ఇద్దరు కన్నింగ్ ఖాకీలకు సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జయంత్ సహకరించినట్లుగా కూడా డాక్టర్ రవీందర్ వెల్లడించిన వివరాల ద్వారా స్పష్టమవుతోంది.
ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడి హోదాలో ఉండి వాస్తవాలేంటో తెలుసుకుని స్పందించి.. తోటి జర్నలిస్టుకు అండగా ఉండాల్సింది పోయి.. ఖాకీల ప్రాపకం కోసం కుట్రలో భాగస్వామి కావడం జయంత్ ‘కురచ’ బుద్ధికి నిదర్శనం. పోలీసులతో చేతులు కలిపి, తప్పుడు కేసులకు వంత పాడుతూ జర్నలిస్టుల ప్రతిష్టను గంగలో కలిపారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ పరువు తీశారు. ‘కాకతీయ’ సాక్ష్యాధారాలను బయటపెట్టడంతో, అంతవరకు గొప్పలు చెప్పుకున్న ఈ సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు ముఖం చాటేస్తుండటం గమనార్హం. తోటి వృత్తిలో ఉన్నవారిపైనే విషం చిమ్మే ఇటువంటి వ్యక్తుల వల్ల జర్నలిజం విలువలు దిగజారుతున్నాయని జర్నలిస్టులు మండిపడుతున్నారు.

వదిలే ప్రసక్తే లేదు.. కలం పోరాటం సాగుతుంది!
చేయని తప్పును చేసినట్లుగా ప్రచారం చేస్తూ ‘కాకతీయ’ ప్రతిష్టను రిపోర్టర్ భాస్కర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఈ కుట్రకు పాల్పడిన ఇద్దరు అధికారులను, కుట్రలో భాగస్వాముడిగా మారిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జయంత్‌ను వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే, అంతకంటే రెట్టింపు వేగంతో అక్రమాలను వెలికితీస్తాం. పోలీసుల అండ చూసుకుని విర్రవీగుతున్న ‘కోవర్టు’ జర్నలిస్టులకు, చట్టాన్ని చుట్టంలా మార్చుకున్న అధికారులకు కాలమే సమాధానం చెబుతుంది. ‘కాకతీయ’ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే నిలుస్తుంది.. కలం ఆగదు, గళం తగ్గదు. అక్రమ కేసులతో గొంతు నొక్కాలనుకునే వారి ఆటలు మా దగ్గర సాగవు! ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవడానికి ‘కాకతీయ’ సిద్ధంగా ఉంది.


