మూడు నెలల్లోగా దరఖాస్తుల పరిష్కారం
ప్రజల ముంగిటకే పాలన అందించడమే లక్ష్యం
ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్ కేటాయింపు
పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, కూసుమంచి: ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును మూడు నెలల్లోగా పరిష్కరించేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రతి విన్నపంపై జవాబుదారీతనంతో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్ ఇచ్చే విధానాన్ని కూసుమంచి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..
నిలువ నీడ లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బిల్లులు జమ చేస్తున్నట్లు తెలిపారు. వరి, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తూ, రికార్డు సమయంలో రైతులకు నగదు చెల్లిస్తున్నామని వివరించారు. నిరుద్యోగ యువత కోసం మే 4న ఖమ్మంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సుమారు 80కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూసేకరణ వంటి పెండింగ్ అంశాలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

