విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి
1000 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం
కేసీఆర్‌పై విమర్శలు కేవలం రాజకీయ నేతగానే చేశా
నా త్రండితో వ్యక్తిగత వివాదాలేమీ లేవు
రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉండాలి
టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
కాకతీయ, హైదరాబాద్ (బషీర్‌బాగ్) : రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించకుంటే పాలకులను రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ప్రకటించిన ‘పాంచజన్యం’లోని ఐదు అంశాలను అమలు చేయకుంటే తనను గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి కట్టేసి కొట్టాలని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఆమె మాట్లాడారు. సర్వోదయ తెలంగాణ సాధనే తన లక్ష్యమని, వెయ్యి రోజుల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు.
నా తండ్రితో వివాదం లేదు..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తాను చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. “నాన్న కేసీఆర్‌తో నాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు. ఒక కూతురిగా ఆయనతో సమస్య లేదు. నా విమర్శలన్నీ కేవలం రాజకీయ నాయకుడైన కేసీఆర్ పైనే” అని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. కేటీఆర్ వంటి ఐటీ మంత్రి ఉన్న కాలంలోనే పదిసార్లు పేపర్ లీక్ అవ్వడం వల్ల రెండు తరాల యువత నష్టపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసేటప్పుడు కనీసం వివరణ కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అమలు సాధ్యమే..
ప్రభుత్వ ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలను విద్య, వైద్యం వంటి ప్రాధాన్యత రంగాలకు కేటాయిస్తే ఉచిత సేవలు అందించడం సాధ్యమేనని కవిత పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతే ఈ హామీలు ఇచ్చానని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘తల్లి మాదిరి పాలన’ అందిస్తామని, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఇతర పార్టీల విమర్శలను తాను పట్టించుకోనని, పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది నడిపే వ్యక్తి చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉండాలి..
జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. అమెరికా సెనేట్ తరహాలో భారత్‌లోనూ అన్ని రాష్ట్రాలకు సమాన అధికారాలు, ఓటింగ్ హక్కులు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. భావసారూప్యత ఉన్న పార్టీలతో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని, అయితే ఎన్నికల తర్వాత పొత్తుల అవసరం రాదని.. ప్రజలు తమకు పూర్తి మెజారిటీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే నేతలు విరహత్ అలీ, రాం నారాయణ పాల్గొన్నారు.

