రైతు సంగ్రామానికి సన్నద్ధం కావాలి
6న హనుమకొండలో బీఆర్ఎస్ భారీ రైతు సదస్సు
కేటీఆర్ పాల్గొంటున్న సభను విజయవంతం చేయాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు
కాకతీయ, నర్సంపేట : రైతు సమస్యలపై గళమెత్తే సమయం ఆసన్నమైందని, మే 6న హనుమకొండలోని హంటర్ రోడ్డులో నిర్వహించనున్న ‘రైతు సంగ్రామ సదస్సు’ను విజయవంతం చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, రైతులు ఉదయం 8 గంటలకే సభ ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, హామీల అమలులో పూర్తిగా వెనుకడుగు వేసిందని సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, ధాన్యం కొనుగోలు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి యూరియా కొరత, విద్యుత్ అంతరాయాలు, సాగునీటి సమస్యలు అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం..
420 హామీలు, 6 గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్ని వర్గాలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు పోటీగా అధికార పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, వార్డు అధ్యక్షులు మరియు మహిళా నేతలు పాల్గొన్నారు.

