పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
టీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు అలిమా, అఖిలేష్ రెడ్డి
పార్టీలో చేరిన 100 మంది కార్యకర్తలు
కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) రాష్ట్ర నాయకులు అలిమా, అఖిలేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు అలిమా, అఖిలేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గాదె రమేష్, కొడాలి శ్రీను, బాస జగ్గయ్య తదితరులు వారికి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత సారథ్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటయిందని వివరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారంలో పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మిగతా రాజకీయ పార్టీల తరహాలోనే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమీకరిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. రాబోయే రోజుల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కమిటీలను వేసి, కార్యకర్తలను నియమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీమాన్, శ్రీనివాస్, రాంబాబు, రాజు, మహిళా కార్యకర్తలు సునీత, రాధిక తదితరులు పాల్గొన్నారు.

