కరెంట్ కోతలు – ప్రజల వెతలు
పాల్వంచ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా
మాజీ మంత్రి వనమా నేతృత్వంలో విద్యుత్ అధికారులకు వినతిపత్రం
కాకతీయ, కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు కరెంట్ కోతలు, అవస్థలు తప్పడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. రోజుకు 15 నుండి 20 సార్లు కరెంట్ నిలిపివేస్తూ ప్రజలను, రైతులను, వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ కరెంట్ కోతలకు నిరసనగా మంగళవారం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పాల్వంచ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో ఎలాంటి కోతల్లేవు..
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించిన విషయాన్ని గుర్తుచేశారు. పాల్వంచ పరిధిలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు (కేటీపీఎస్) ఉన్నప్పటికీ.. స్థానికంగా కరెంట్ కోతలు విధించడం అత్యంత దారుణమన్నారు. ఒకవైపు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు కోతలతో సామాన్య ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఈ వైఫల్యాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడే నాణ్యమైన విద్యుత్ సరఫరా తిరిగి అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నిరసనకారులు విద్యుత్ కార్యాలయంలోని అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కనగాల బాలకృష్ణ, మల్లెల రవిచంద్ర, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, ముత్యాల ప్రవీణ్, కార్పొరేటర్లు గుగులోత్ రాంబాబు, గుణ చరిత్, నాయకులు కాల్వ ప్రకాష్, పత్తిపాటి శ్రీను, జూపల్లి దుర్గాప్రసాద్, బట్టు మంజుల, కిలారు చిన్న, కొంచెర్ల రామకృష్ణ, చందు నాయక్, నారికట్ల శేఖర్, దాసరి సురేష్, హర్ష, వీరన్న, ఆనంద్, శంకర్, నాయుడు, నాగసత్యం, చంద్రశేఖర్, చింతలచెరువు దుర్గాప్రసాద్, ఆనంద్, ఫిరోజ్, సంపత్ రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

