నగరంలో ‘రౌడీ రాజ్యం’..
హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం
మహిళా పోలీస్ కమిషనర్‌కే రక్షణ లేని దుస్థితి
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
పోలీసులను రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటున్నారు
బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళల రక్షణ గాలికొదిలేశారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశానికి అర్ధరాత్రి స్వేచ్ఛ వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు గాంధీజీ కలలు కన్నారని, కానీ నేటి రేవంత్ రెడ్డి పాలనలో మహిళలు పగటిపూట కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని మండిపడ్డారు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో స్వయంగా మహిళా పోలీస్ కమిషనర్ సుమతి గారికే వేధింపులు ఎదురుకావడం అత్యంత శోచనీయమని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటే రక్షించే దిక్కు లేకపోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు. సుమారు మూడు గంటల పాటు కనీసం పెట్రోలింగ్ వాహనాల ఊసే లేదని, అసలు షీ టీమ్స్, బ్లూ కోల్ట్స్ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే సామాన్య మహిళల భద్రత ఏమిటని నిలదీశారు.
పొలిటికల్ పోలీసింగ్ నడుస్తోంది
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన అంతర్జాతీయ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ కేవలం ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం వాడుకుంటున్నారని శ్రవణ్ ఆరోపించారు. హైటెక్ నిఘా వ్యవస్థలు ఉన్నా ఒక ఉన్నతాధికారిణిని వేధిస్తున్నా గుర్తించలేకపోవడం దారుణమన్నారు. ఎన్సీఆర్బీ (NCRB) గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో మహిళలపై నేరాలు ఏకంగా 6 శాతం పెరిగాయని, దక్షిణ భారతదేశంలోనే మహిళలపై నేరాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆందోళన వ్యక్తం చేశారు.
గంజాయి బ్యాచ్‌ల హల్చల్
నగరంలో అర్ధరాత్రి వేళల్లో గంజాయి మత్తులో ముఠాలు హల్చల్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని శ్రవణ్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ సభలు, తిట్ల పురాణాలపై ఉన్న శ్రద్ధను పక్కనబెట్టి ప్రజల భద్రతపై దృష్టి సారించాలని హితవు పలికారు. పోలీసులను రాజకీయ అవసరాల కోసం కాకుండా తల్లులు, చెల్లెళ్ల రక్షణ కవచాలుగా మార్చాలని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, గ్రేటర్ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

