కాంగ్రెస్ అభివృద్ధి ఫలాలపై రచయితల వర్క్‌షాప్
కరపత్రాన్ని ఆవిష్కరించిన ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
కాకతీయ, హనుమకొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రచయితలు, కళాకారులు కృషి చేయాలని డీసీసీ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ కాంగ్రెస్ అభివృద్ధి ఫలాలు అంశంపై రచయితల వర్క్‌షాప్‌కు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఉదయం హనుమకొండలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే బాధ్యత రచయితలు, కళాకారులపై ఉందన్నారు. వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ విధానాలను సృజనాత్మక రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా చర్చలు జరగనున్నట్లు తెలిపారు.
కళాకారుల భాగస్వామ్యం కీలకం
సామాజిక చైతన్యానికి కళారూపాలు ముఖ్యమైన వేదికలని, ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయడంలో కళాకారులు కీలక పాత్ర పోషించాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెన్నమల్ల వెంకటేష్, వరంగల్ జిల్లా అధ్యక్షులు గడ్డం సుధాకర్, పొలెపాక రమేష్, నాగుల సుధాకర్, పాలేటి రాజు, శివకృష్ణ, సమ్మయ్య, పిట్ట భవాని, వైద్యుల రజిత రెడ్డి, లత తదితర కళాకారులు పాల్గొన్నారు.

