ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్
కాకతీయ,శంకరపట్నం : రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ధాన్యం తూకం వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. పది రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో అకాల వర్షాల భయంతో రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేశారు. కేశవపట్నం మార్కెట్ యార్డును సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హమాలీలు, రవాణా, టార్పాలిన్ల వంటి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. తరుగు పేరుతో 42 కిలోలకు పైగా తూకం వేయడం వల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రేమిడి రాజిరెడ్డి, గద్దపాక ఉపసర్పంచ్ జంగ జైపాల్, నాయకులు దొంగల రాములు, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, నిమ్మశెట్టి సంపత్, మాందాడి జగ్గారెడ్డి, చెర్ల శ్రీనివాస్, బిజికి సారయ్య, గొల్లిపెల్లి వెంకటేషం, గిద్దెమారి నర్సయ్య, కుర్రె అజయ్ తదితరులు పాల్గొన్నారు.

