కారు – బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
కాకతీయ, పెద్దవంగర : పెద్దవంగర మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న కారు మరియు బైక్ బలంగా ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. తొర్రూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, పెద్దవంగర నుండి తొర్రూర్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన చినసాని మల్లేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, క్షతగాత్రుడిని తొర్రూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కారును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై ప్రమోద్ కుమార్ కేసు నమోదు చేయగా, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

