రేవంత్ పాలనలో నేరాల ‘రాజ్యం’!
ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్
ఎన్‌సీఆర్‌బీ గణాంకాలే రాష్ట్ర పరిస్థితులకు నిదర్శనం
నగరం నడిబొడ్డున ఐపీఎస్ భార్య హత్యే శాంతిభద్రతలకు అద్దం
సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసుల్లో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై ఏది?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో కళ్లకు కడుతున్నాయని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇప్పుడు నేరాలకు నిలయంగా మారిందని, ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం అత్యంత ఆందోళనకరమని, 2023తో పోలిస్తే సైబర్ నేరాలు ఏకంగా 49 శాతం పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. గతేడాది తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, హైదరాబాద్ నగరం ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ప్రధాన కేంద్రంగా మారిందని వివరించారు.
అదృశ్యమవుతున్న బాల్యం.. అభద్రతలో మహిళలు
రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు, మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్య భయానకంగా ఉందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో తెలంగాణలో 25,500 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయని, వారిలో వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదన్నారు. ప్రతిరోజూ సగటున ఆరుగురు చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు. చిన్నారులపై నేరాలు భారీగా పెరిగాయని, గతేడాది 6,767 కేసులు నమోదయ్యాయని, కిడ్నాప్‌కు గురైన చిన్నారుల్లో అత్యధికులు బాలికలే ఉండటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని విమర్శించారు. మహిళలపై నేరాలు గత రెండేళ్లలో 22,066 నుంచి 24,495కు పెరిగాయని, ముఖ్యంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కుప్పకూలిందనడానికి నిదర్శనమన్నారు. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా, దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిందో స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు పెరగడం, మహిళల భద్రత క్షీణించడం ప్రభుత్వ అట్టర్ ఫ్లాప్ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
విఐపీ జోన్లలోనే హత్యలు.. గాలికి గస్తీ
కరీంనగర్‌లో పట్టపగలు, అందరూ చూస్తుండగానే నగల దుకాణం దోపిడీ జరిగితే, నిందితులను ఇప్పటికీ పట్టుకోలేక పోలీసులు సాకులు చెబుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన కేసులను సైతం పోలీసులు 24 గంటల్లో ఛేదించేవారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై పట్టపగలు దాడులు జరుగుతున్నాయని, సామాన్యులకే కాదు ఉన్నతాధికారులకూ రక్షణ లేదని మండిపడ్డారు. ఐఏఎస్ క్వార్టర్స్‌లో ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురవ్వడం రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అద్దం పడుతోందన్నారు. సీపీ సుమతి నిర్వహించిన ఆపరేషన్‌తో హైదరాబాద్‌లో మహిళల భద్రత ఎంత డొల్లగా మారిందో బట్టబయలైందన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లలో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో కూర్చుని సమీక్షలు నిర్వహించడం కాదని, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. రేవంత్ సర్కారు కేవలం ప్రచారం, రాజకీయ కక్షసాధింపు, మీడియా మేనేజ్‌మెంట్‌పైనే శ్రద్ధ పెట్టిందని, ప్రజల భద్రతను రాజకీయాల కోసం బలి చేయవద్దని హెచ్చరించారు. తక్షణమే ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

