బ్యాంకు ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
ఎస్బీఐ రీజినల్ కార్యాలయం వద్ద సిబ్బంది మౌన నిరసన
డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
కాకతీయ, ఖమ్మం : “దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్న సిబ్బందిపై పనిభారం పెంచడం ఎంతవరకు న్యాయం? మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి” అంటూ బ్యాంకు ఉద్యోగులు గళమెత్తారు. బ్యాంకు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ నాయకులు కె. రాంబాబు నేతృత్వంలో శుక్రవారం ఖమ్మం ఎస్బీఐ రీజినల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు మౌన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు కె. రాంబాబు మాట్లాడుతూ.. ఆలిండియా స్టాఫ్ యూనియన్ ప్రభుత్వం ముందు 16 డిమాండ్లను ఉంచిందని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన మెసెంజర్ల నియామకాలు, ఆర్మూడ్ గార్డుల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్ చేయడం వల్ల వ్యవస్థ దెబ్బతింటోందని, తగినంత సిబ్బంది లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 తర్వాత నియమితులైన వారికి అంతర్గత బదిలీల అవకాశం కల్పించాలని, ఎన్పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మార్చుకునే వీలు కల్పించాలని కోరారు.
ఆందోళన ఉధృతం చేస్తాం..
మే 4వ తేదీ నుంచి దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని, బ్యాడ్జీల ధారణ, భోజన విరామ సమయంలో నిరసనలు, ట్విట్టర్ క్యాంపెయిన్లకు ఉద్యోగుల నుంచి అపూర్వ స్పందన లభించిందని రాంబాబు వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే మే 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎస్బీఐ ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

