పశువుల ఆరోగ్య రక్షణే లక్ష్యం
వెటర్నరీ వైద్యులు డాక్టరు ఉజ్వల – డాక్టరు శిరీష
కొత్తరెడ్డిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరం
దూడల ర్యాలీలో విజేతలకు బహుమతుల ప్రదానం
కాకతీయ, పినపాక/మణుగూరు : పశువుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ఉజ్వల కోరారు. పినపాక మండలం ఈ బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ శిబిరంలో పశువుల సంతానోత్పత్తి పరీక్షలు, ఆరోగ్య తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెటర్నరీ వైద్యులు డాక్టర్ ఉజ్వల, డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. పశువులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు మల్టీవిటమిన్లు, మినరల్ మిక్చర్లు, డీవార్మింగ్ మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పశుగ్రాసం, వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన దూడల ర్యాలీలో ఉత్తమంగా నిలిచిన దూడల యజమానులకు (రైతులకు) బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ బయ్యారం సర్పంచ్ వాగబోయిన చందర్రావు, ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్ రెడ్డి, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గోపాలమిత్రలు మరియు పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

