బండి సంజయ్ రాజీనామా చేయాలి
బండి భగీరథ సాయిపై పోక్సో కేసు సమగ్ర విచారణ జరిపించాలి
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్
కాకతీయ, మణుగూరు (పినపాక) : భగీరథ సాయి వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని పినపాక బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పినపాక మండలం ఈ-బయ్యారం క్రాస్ రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎంతటి వారైనా రాజకీయ హోదా చూడకుండా చర్యలు తీసుకోవాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు నైతిక విలువలు బోధించే నాయకులు, తమ కుటుంబ సభ్యుల వ్యవహారాల్లోనూ బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల రక్షణపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వాసు బాబు, భద్రయ్య, రవి శేఖర్ వర్మ, నాజర్ రెడ్డి, కొండేరు రాము, పోలిశెట్టి సత్తిబాబు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

