కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల వలస
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీలు వైనాల వీరస్వామి, జన్ను జెరాజ్‌లతో పాటు శ్యామల దేవేందర్‌లు సోమవారం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

