హైదరాబాద్‌లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ సెంటర్
సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధుల భేటీ
మే 20న ఐటీ గ్లోబల్ సెంటర్ ప్రారంభోత్సవం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ భాగ్యనగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేస్తోంది. దీంతో అంతర్జాతీయ జీసీసీల హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ నగర కీర్తికిరిటంలో మరో మైలురాయి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయింది. మే 20న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తమ సరికొత్త గ్లోబల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రికి వారు అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఈవీపీ మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇండియా సెంటర్ హెడ్ కృష్ణ కల్లెపల్లి, వీపీ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్ ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణ ప్రణాళికలు, సాంకేతిక ఆవిష్కరణల గురించి మంత్రికి వివరించారు.
ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఇక్కడి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ హైదరాబాద్‌కు రావడం వల్ల తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున నాణ్యమైన, ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

