ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన
మండల కార్యదర్శి యాసా నరేష్ మండిపాటు
కాకతీయ, జూలూరుపాడు : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడు ఎన్నికలు ముగిసినా ప్రజలపై భారాలు మోపడం బీజేపీ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలను పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలతో పాటు రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల నిత్యవసర వస్తువుల ధరలు, వ్యవసాయ సాగు ఖర్చులు కూడా పరోక్షంగా పెరుగుతాయన్నారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వలమల్ల చందర్రావు, గార్లపాటి వెంకటి, పద్దం సుగుణ, ఈసం నర్సింహరావు, పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, జరుకుల మల్లయ్య, బొల్లి లక్ష్మయ్య, బోడ అభిమిత్ర తదితరులు పాల్గొన్నారు.

