ఆసుపత్రి కార్మికుల సమస్యలు తీర్చాలి
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
డీఎంఈ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌కు వినతి అందజేత
కాకతీయ, ఖమ్మం : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ (ఎస్పీఎస్ ఎం అండ్ హెచ్ డబ్ల్యు) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన అనంతరం టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య మాట్లాడుతూ, రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నా తమకు తగిన గుర్తింపు లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,800 మంది కార్మికులు చాలీచాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, ఏజెన్సీ దారులు ఇష్టారీతిన అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, మూడు నెలలు పనిచేస్తే ఒక నెల వేతనం ఇస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చాలా ఆసుపత్రుల్లో కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదని, దీనిపై ప్రశ్నించిన వారిని విధులకు రావద్దంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రుల్లో సమయపాలన లేకుండా ఓవర్‌టైమ్ డ్యూటీలు చేయిస్తూ, నెలకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారని లబోదిబోమన్నారు. కార్మికుల సమస్యలపై సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్కా నరేష్ మాట్లాడుతూ, కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులకు నెలకు రూ.26,000 వేతనం చెల్లించాలని, అలాగే ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ఐహెచ్ఎఫ్ఎంఎస్ నుండి ఎఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేయాలన్నారు. దీంతో పాటు కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఈపీఎఫ్ లో యాజమాన్యం వాటాను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్యాజువల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అనునిత్యం వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, వారి హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఇసనపల్లి అంబేద్కర్, ప్రధాన కార్యదర్శి కర్ష జగదీష్, కోశాధికారి బత్తుల మమత, గౌరవ సలహాదారులు నాగేశ్వరరావు, రాధా మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

