సింగరేణి మండలంలో వడదెబ్బ బీభత్సం
ఎండలకు ముగ్గురు మృతి.. గ్రామాల్లో విషాద ఛాయలు
మృతుల్లో భాగ్యనగర్ తండా, దుబ్బ తండా, ఉసిరికాయలపల్లి వాసులు
కాకతీయ, కారేపల్లి : భానుడి భగభగలకు సింగరేణి (కారేపల్లి) మండలంలో వడదెబ్బ ప్రాణాలు తీస్తోంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వడదెబ్బ కారణంగా వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మండలంలోని భాగ్యనగర్ తండాకు చెందిన గూగులోతు పద్మ (45) ఎండ తీవ్రతను తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందింది. అలాగే దుబ్బ తండా గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న బానోత్ రమేష్ (40) విధి నిర్వహణలో ఉండగానే తీవ్ర వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతిపై గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఉసిరికాయలపల్లికి చెందిన తేజవత్ సొల్తా (70) అనే వృద్ధుడు కూడా తీవ్రమైన ఎండల ప్రభావంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలో వరుసగా వడదెబ్బ మరణాలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో వృద్ధులు, కూలీలు, బయట పనులు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. కాగా, వడదెబ్బతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



