‘విశ్వ’ మాయ!
భవనాల నిర్మాణంలో అక్రమాలు
ప్లాట్ల అమ్మకాల్లో భారీ మోసాలు.. సొంత ఇంటి కలలపై నీళ్లు
మున్సిపాలిటీకి తాకట్టు పెట్టిన ప్లాట్లనే దర్జాగా రిజిస్ట్రేషన్లు
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే నిర్మాణాలు
అసైన్డ్ భూముల్లోనే బహుళ అంతస్తులు నిర్మించినట్లు ఆరోపణలు
ఆర్యవైశ్య పెద్ద ముసుగులో అక్రమ సంపాదనకు తెరలేపిన ఘనుడు
క్రెడాయి మాజీ అధ్యక్షుడినంటూ కొనుగోలుదారులకు బెదిరింపులు
చర్చిలు బడులే టార్గెట్.. భాగస్వాములకు సైతం చుక్కలు
వైరా రోడ్డు చర్చి పక్కన భవనంపై రూ. 2 కోట్ల జీఎస్టీ ఎగవేతకు ప్లాన్
కాకతీయ,ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం (రియల్ ఎస్టేట్) పేరుతో కొందరు బిల్డర్లు సాగిస్తున్న అక్రమాలు, మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సొంత ఇంటి కోసం జీవితకాల కష్టాన్ని ధారపోస్తున్న మధ్యతరగతి ప్రజల ఆశలపై కొందరు అక్రమార్కులు నీళ్లు చల్లుతున్నారు. నగరంలో భారీ భవనాలు నిర్మించిన ఓ బిల్డర్.. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 2014 లో ఓ బడి కూల్చివేత కేసులో నిందితుడిగా ఉన్న కొప్పు నరేష్.. అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాల్లో దిట్ట అనే విమర్శలు ఉన్నాయి. సమాజంలో పెద్దమనిషిగా చెలామణి అవుతూ, ఆర్యవైశ్య సంఘంలో గొప్పవానిగా చెప్పుకుంటూ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారి తన పబ్బం గడుపుకోవడం ఈయనకు పరిపాటిగా మారింది.

అసైన్డ్ భూముల్లో అపార్ట్‌మెంట్లు
నగరంలోని సర్వే నెంబర్ 123 లో నిర్మించిన బహుళ అంతస్తుల స్థలంలో అసైన్డ్ భూమి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విశ్వ టవర్ పేరుతో నిర్మించిన భవనంతో సహా, దాని పక్కనే ఉన్న కోహినూర్ టవర్స్ ను కూడా తప్పుడు డాక్యుమెంట్ల సహకారంతో అధికారుల చేతులు తడిపి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. అసలే అది అసైన్డ్ భూమి.. దానిలో గతంలో రైస్ మిల్లు, పప్పు మిల్లు నడిచేవి. అలాంటి స్థలంలో ఇప్పుడు ఏవిధంగా భారీ భవనాలు వెలిశాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి ఆశలు అడియాశలు కానున్నాయి. అసైన్డ్ భూమిపై నిర్మాణాలు చట్టబద్ధం కాకపోగా, వాటి రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు. ప్రభుత్వం ఎప్పుడైనా ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారం ఉంటుంది. రేరా సెక్షన్ 3 ప్రకారం రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్ట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా చట్టప్రకారం శిక్షార్హులు అవుతారు.
రూ. 2 కోట్ల జీఎస్టీ ఎగవేతకు ప్లాన్
భవన నిర్మాణం తర్వాత ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ ఎగవేత కోసం సదరు బిల్డర్ తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వైరా రోడ్డులోని చర్చి పక్కన ఉన్న భవనంపై సుమారు రూ. 2 కోట్ల వరకు జీఎస్టీ ఎగవేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల కొనుగోలుదారుకు నేరుగా ఇబ్బంది లేకపోయినా, భవనంపై పెనాల్టీ పడితే భవిష్యత్తులో మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా మున్సిపాలిటీకి తాకట్టు (మార్టిగేజ్) పెట్టిన ప్లాట్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా కాపురం పెడితే మున్సిపాలిటీ విద్యుత్, వాటర్ కనెక్షన్లు కట్ చేయడమే కాకుండా భవనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఏ భవన నిర్మాణం చేపట్టినా చుట్టూ ఫైర్ సేఫ్టీ, గ్రీనరీ, ఇంకుడు గుంతలు తదితర మున్సిపల్ నిబంధనలు పాటించాల్సి ఉండగా, ఒక్కో భవనానికి ఒక్కొక్క నిబంధనను వదిలేశారు.
మాజీ అధ్యక్షుడి ముసుగులో బెదిరింపులు
తాను క్రెడాయి బహుళ అంతస్తుల నిర్మాణదారుల మాజీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నానని, తాను చెప్పినట్లుగా ప్లాట్లు కొనుగోలు చేయాలని, లేకుంటే మీరేం చేసుకుంటారో చూస్తా అంటూ కొనుగోలుదారులను సదరు బిల్డర్ బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డెవలప్మెంట్ పేరుతో యజమానుల నుండి భూములను అగ్రిమెంట్ చేయించుకుని, భవన నిర్మాణం పూర్తయిన తర్వాత భూ యజమానులను, అటు తోటి భాగస్వాములను (పార్ట్నర్లను) సైతం మోసం చేస్తూ వారికి చుక్కలు చూపిస్తున్నాడు. కొన్నేళ్లుగా నగరంలో భవనాల నిర్మాణాలు చేపడుతూ, సొంత పలుకుబడిని పెంచుకునేందుకు వర్తక సంఘంలో అధ్యక్షుడిగా గెలిచి, పలువురు రాజకీయ పెద్దల సమక్షంలో పార్టీలు మారుతూ తన సొంతానికి అధికార దుర్వినియోగం చేస్తున్న ఈ ‘ఘనుడి’ అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

