ఎన్టీఆర్ కారణ జన్ముడు
ఆయన జననమే ఒక చరిత్ర
ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి
బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక నందమూరి : మాజీ మంత్రి పువ్వాడ
లకారం ట్యాంక్‌బండ్ విగ్రహం వద్ద నివాళులర్పించిన నామా, పువ్వాడ, సండ్ర
కాకతీయ, ఖమ్మం : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జననమే ఒక చరిత్ర అని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశానికి, తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు తక్షణమే ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను 17వ లోక్‌సభలోనూ ఈ విషయమై కేంద్రాన్ని కోరినట్లు గుర్తుచేశారు.

పార్లమెంట్‌లో విగ్రహం నా అదృష్టం : నామా
చారిత్రాత్మక ఘట్టం: ఎన్టీఆర్ మరణించిన 17 ఏళ్ల తర్వాత.. 2013లో (15వ లోక్‌సభ) తాను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అన్ని పార్టీల మద్దతుతో పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపడం తన జీవితకాల అదృష్టమని నామ నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు, రూ.2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి ఎన్టీఆర్ విప్లవాత్మక సంస్కరణలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
కేసీఆర్ పథకాలు ఎన్టీఆర్ స్ఫూర్తే : పువ్వాడ
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే ఖమ్మంలో భారీ విగ్రహాన్ని నెలకొల్పామన్నారు. గతంలో సీఎం కేసీఆర్ కూడా ఎన్టీఆర్ మాదిరిగానే అనేక అద్భుత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ, పార్టీ ముఖ్య నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

