మొక్కజొన్న లోడింగ్ స్పీడప్ చేయండి
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అంకిత్
తడిసిపోకుండా పటిష్ట చర్యలు : అధికారుల వివరణ
కాకతీయ, జూలూరుపాడు : కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జూలూరుపాడు మండలం సాయిరాం తండా సమీపంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. గత రాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో కేంద్రంలోని నిల్వలు ఏమైనా తడిసాయా? అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. టార్పాలిన్లతో ముందస్తుగా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం కేంద్రంలో నిల్వ ఉంచిన మొక్కజొన్న నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం కేంద్రంలో 3,600 బస్తాలు అందుబాటులో ఉన్నాయని, ఈ రోజే మొత్తం లోడింగ్ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. నిన్న ఎన్ని లారీలు లోడింగ్ చేశారు? ఇప్పటివరకు ఎంత మేర గోదాములకు తరలించారనే వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఇప్పటివరకు సుమారు 28 వేల బస్తాలను గోదాములకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీనివాస్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

